ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. పాలనపరంగా ఆయన ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహించారు. ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ... గల్లీ నుంచి ఢిల్లీ స్థాయివరకు సముచిత పాలన అందించాల్సిన ప్రధాని మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కులాలు, జాతుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. 1973–1974లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చినప్పటి నుంచి రైతులు, ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు.
కావేరి నదీ జలాల పంపిణీలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులు రాష్ట్రానికి, ప్రజలకు శరాఘాతాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తమ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే అసెంబ్లీ తీర్మానం మేరకు తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమన్నారు. కావేరీ జలాల విషయంలో తమది బాధిత రాష్ట్రమే గానీ, విలన్ రాష్ట్రం కాదన్నారు.