ఇప్పటికే దేశ ప్రజలు కరోనా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వైరస్‌లతో బెంబేలెత్తిపోతున్నారు. ఇపుడు మళ్లీ బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో ఈ వైరస్ సోకి బాతులు కోళ్లు చనిపోతున్నాయి. దీంతో వేలాది కోళ్ళను హననం చేస్తున్నారు. ముఖ్యంగా, బాతులు, కోళ్ళను చంపి తగలబెట్టేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను సైతం నియమించింది.
ఈ రాష్ట్రంలో ఇప్పటికే వేలాది కోళ్ళకు ఫ్లూ సోకింది. ముఖ్యంగా కొట్టాయం జిల్లాలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు తాజాగా బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా బుధవారం నుంచి కోళ్లు, బాతులను సామూహిక హననం చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వేచూరు, ఆయమనమ్, కల్లార పంచాయతీలలో పక్షుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డీసీజెస్ కేంద్రంలో పరీక్షించగా, బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది.
దీంతో వైరస్ అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధికారులను ఆదేశించారు. గతవారం పక్కనే ఉన్న అళప్పుళ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ వెలుగులోకి రావడంతో నియంత్రణ చర్యల్ల భాగంగా, కోళ్లను, బాతులను చంపేశారు.
తాజాగా అదే పరిస్థితి చేయనున్నారు. దీంతో కోళ్ళ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని, ఒకవేళ సంక్రమిస్తే మాత్రం సమస్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.