ప్రభుత్వ పాఠశాలలన్నీ డిజిటలైజయిన తొలి రాష్ట్రం కేరళ

గురువారం, 15 అక్టోబరు 2020 (08:12 IST)
దేశంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ హైటెక్‌ తరగతి గదులు కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలవనుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. విద్యారంగం పూర్తిగా డిజిటలైజ్‌ చేయబడిందని ప్రకటించారు. ఇది రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయమని, తరువాతి తరాలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

విద్యారంగాన్ని పూర్తి డిజిటలైజ్‌గా మార్చిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలవనుందని ప్రకటిస్తూ.. విజయన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఈ మిషన్‌కు నాయకత్వం వహించిందని, ప్రభుత్వ విద్యను డిజిటలైజ్‌ చేసేందుకు నాలుగు సంస్థలను నియమించినట్లు చెప్పారు.

అన్ని సంస్థలు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనిచేశాయని అన్నారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందిస్తామని, అయితే పాఠశాలలను పున:ప్రారంభించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు.

ఎంపి, ఎమ్మెల్యే నిధులు, స్థానిక స్వపరిపాలన సంస్థల నిధులను ఈ తరగతి గదుల ఏర్పాటుకు ఉపయోగించామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ప్రజల వైఖరితో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని అన్నారు.

విద్య, ఇతర రంగాలలో పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామంలోని ఏ పాఠశాల అయినా ప్రపంచంలోని పాఠశాలలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.

స్మార్ట్‌ తరగతి గదుల ప్రాజెక్టులో భాగంగా 16,027 పాఠశాలలకు సుమారు 3.74లక్షల డిజిటల్‌ పరికరాలను అందించామని అన్నారు. మొదటి దశలో 4,752 ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలల్లో 8 నుండి 12 వ తరగతులకు 45వేల హైటెక్‌ తరగతి గదులు సిద్ధం చేశామని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్‌ను 2018, జనవరి 21న ప్రారంభించామని ప్రకటించారు. అలాగే 1నుండి 7వ తరగతులకు 11,275 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో హైటెక్‌ ల్యాబ్‌లు ప్రారంభించామని, ఈ కార్యక్రమం గతేడాది ప్రారంభించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు