బికినీలో మహిళా ప్రొఫెసర్ : రూ.99 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ...
బుధవారం, 10 ఆగస్టు 2022 (08:57 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఓ యూనివర్శిటీలో పని చేసే మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీ దుస్తుల్లో కనిపించి విద్యార్థులతో పాటు యూనివర్శిటీ అధికారులను షాక్ తిన్నారు. ఇలాంటి దుస్తులు ధరించి, యూనివర్శిటీ పరువు తీసినందుకు రూ.99 కోట్ల అపరాధం చెల్లించాలంటూ ఆదేశించారు. అంతేకాకుండా ఆ మహిళా ప్రొఫెసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
ఆ మహిళా ప్రొఫెసర్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతావుంది. ఇందులో తరచూ ఫొటోలు అప్‌లోడ్ చేస్తుండేది. ఈ క్రమంలో ఓరోజు ఫ్లస్ టూ చదువుతున్న ఓ విద్యార్థి(18) ఆమె ఫొటోలను పదే పదే చూస్తూ ఉండటాన్ని గమనించిన విద్యార్థి తండ్రి.. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.
సదరు మేడమ్‌గారు అలాంటి ఫొటోలు అప్‌లోడ్ చేయడం సిగ్గుచేటని.. ఆమె వల్ల తమ పిల్లలు పాడైపోతున్నారని, ఆమె బికినీలో ఫొటోలు అప్‌లోడ్ చేయడం విద్యార్థులను రెచ్చగొట్టడమే అవుతుందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఫొటోలను సైతం ఎటాచ్ చేసి మరీ పంపించాడట.
ఈ నేపథ్యంలో కిందటి ఏడాది అక్టోబర్‌లో మీటింగ్ పెట్టి మరీ ఆమెను తొలగించక తప్పలేదు. అయితే ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసిందని.. అభ్యంతరకర ఫొటోల విషయంలో కాదని కాలేజీ యాజమాన్యం ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది.
అయితే ఆ మరుసటిరోజే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన ఫోన్‌ను, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి ఎవరో.. వ్యక్తిగత ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్యారెక్టర్‌ను దిగజార్చే క్రమంలోనే ఇదంతా జరుగుతోందని, ఇది ముమ్మాటికీ కాలేజీ యాజమాన్యం తనపై చేస్తున్న వేధింపుల కిందకే వస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈలోపు తనకు సదరు విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు కాపీ ఇవ్వాలంటూ యూనివర్సిటీకి సదరు ప్రొఫెసర్ లీగల్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు ఈ ఏడాది మార్చి 28వ తేదీన యూనివర్సిటీ స్పందించింది.
లీగల్ నోటీసులను దురద్దేశ పూర్వకంగా పంపారని, ఇది కాలేజీ ప్రతిష్టను దెబ్బ తీయడమే అవుతుందని బదులు ఇచ్చింది. అంతేకాదు భేషరతు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం కింద 99 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు యూనివర్శిటీ బదులు ఇచ్చింది. దీంతో సదరు మహిళా ప్రొఫెసర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు.