ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీకి కష్టాలు ఎక్కువయ్యాయనీ కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్‌సజనశక్తి ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల పూర్తిగా మునిగిపోకముందే మేల్కోవాలని ఆయన హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్టు చేస్తూ, ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిన తర్వాతే ఎన్డీయేకు కష్టాలు ప్రారంభమయ్యాయని, సహచర పార్టీలతో ఉన్న విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ పెద్దలు విఫలమవుతున్నారన్నారు.
'ఎన్డీయే నుంచి టీడీపీ, ఆర్ఎల్ఎస్పీ వెళ్లిపోవడంతో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి మరింత దారుణంగా మారకముందే బీజేపీ చర్యలు తీసుకోవాలి. పూర్తిగా చేతులు కాలకముందే గౌరవప్రదమైన పద్ధతిలో భాగస్వాముల సమస్యలు పరిష్కరించాలి' అని వ్యాఖ్యానించారు.