పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

ఠాగూర్

ఆదివారం, 25 మే 2025 (18:44 IST)
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాద్ యాదవ్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేశారు. తేజ్‌కు పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి ఉద్వాసన పలికారు. తమకు బంధుత్వాల కంటే కుటుంబ విలువలు ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. 
 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, బాధ్యతారహిత ప్రవర్తన, కుటుంబ విలువలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారన్న కారణాలతో తేజ్ ప్రతాపను పార్టీ నుంచి, అలాగే యాదవ్ కుటుంబం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయాన్ని ఆయన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
 
లాలూ ప్రసాద్ యాదవ్ తన పోస్టులో, "వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం వల్ల సామాజిక న్యాయం కోసం మనం చేస్తున్న సమష్టి పోరాటం బలహీనపడుతుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, బహిరంగ ప్రవర్తన, బాధ్యతారహిత వైఖరి మన కుటుంబ విలువలకు అనుగుణంగా లేవు. అందువల్ల, అతన్ని పార్టీ నుంచి, కుటుంబం నుంచి తొలగిస్తున్నాను. ఇప్పటి నుంచి పార్టీలో గానీ, కుటుంబంలో గానీ అతనికి ఎలాంటి పాత్ర ఉండదు" అని పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, "అతను తన వ్యక్తిగత జీవితంలోని మంచి చెడులు, యోగ్యత అయోగ్యతలను చూసుకోగల సమర్థుడు. అతనితో సంబంధాలు పెట్టుకునే వారు తమ విచక్షణ మేరకు నిర్ణయించుకోవచ్చు" అని లాలూ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు