‘నాన్న మీరే నా హీరో’.. భావోద్వేగ పోస్టు పెట్టిన లాలూ కుమార్తె..!

మంగళవారం, 5 జులై 2022 (13:02 IST)
ఇటీవల తన ఇంటి మెట్లపై నుంచి జారిపడిన ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వెన్నెముకకు గాయమైంది. భుజం ఎముక విరిగింది. దీంతో పాట్నాలోని పారస్‌ ఆసుపత్రిలో ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. 
 
పైగా, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ట్విటర్ వేదికగా ఆయన చిత్రాలను షేర్ చేస్తూ.. తండ్రే తన హీరో అంటూ తన ప్రేమను చాటుకున్నారు. 
 
'నా హీరో.. నా బ్యాక్‌ బోన్‌.. త్వరగా కోలుకో నాన్న. ప్రతి అవరోధం నుంచి విముక్తి పొందిన ఆయన వెంట ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వారి అభిమానమే ఆయన బలం' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆమె వీడియో కాల్ ద్వారా తన తండ్రి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. 
 
ఈ రోజు ఆర్జేడీ 26వ వ్యవస్థాపక దినోత్సవం. అయితే తమ అధినేత ఆసుపత్రిలో ఉండటంతో భారీ వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ఇదిలావుండగా, గత కొద్ది కాలంగా లాలూను అనారోగ్యం వేధిస్తోంది. అలాగే కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. 
 
ఈ సమయంలో పార్టీ పగ్గాలను ఇద్దరు కుమారుల్లో ఒకరికి అప్పచెబుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చిన్న కుమారుడు తేజస్వి యాదవ్‌కే పార్టీ బాధ్యతలు అందజేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే గతంలో లాలూ భార్య రబ్రీ దేవీ ఈ వార్తలను ఖండించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు