బాలికలకు శృంగార వయసు 16 యేళ్లకు తగ్గించాలి : ఎంపీ కోర్టు

ఆదివారం, 2 జులై 2023 (13:38 IST)
మారిన, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా శృంగారానికి సమ్మతి తెలిపే వయసును ముఖ్యంగా బాలికలకు 18 నుంచి 16 ఏళ్లకు కుదించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ అభిప్రాయపడింది. తద్వారా కిశోరప్రాయ(టీనేజ్) బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 
 
2020లో ఒక బాలికను పదేపదే మానభంగం చేసి, గర్భవతిని చేశాడంటూ ఒక యువకునిపై దాఖలైన ఎఫ్ఎస్ఐఆర్‌ను హైకోర్టు జూన్ 27న కొట్టివేసింది. అదేసమంలో కేంద్రానికి ఈ సూచన పంపింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదీ 2020లో బాలిక. అప్పట్లో ఆమె ఒక వ్యక్తి వద్ద విద్యాపరమైన శిక్షణ పొందేది. అతడు ఒకరోజు మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి తనను అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తూ పదేపదే తనను లొంగదీసుకుంటున్నాడని ఆరోపించింది. తర్వాత ఆమెకు ఒక సన్నిహిత బంధువుతోనూ శారీరక సంబంధం ఉన్నట్లు తేలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
 
ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ వల్ల బాలబాలికలకు 14 ఏళ్ల వయసులోనే పెద్దరికం వస్తోందనీ, బాలికలు 14 ఏళ్లకే యవ్వన దశకు చేరుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. కిశోరప్రాయంలోనే బాలబాలికలు పరస్పర శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారని గుర్తుచేశారు. 
 
ఇందులో ఇద్దరి తప్పిదం ఉన్నప్పటికీ బాలురు నేరారోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో రతి (శృంగారం)కి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సూచించారు. నిజానికి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)కి సవరణ చేయక ముందు ఈ వయసు 16 ఏళ్లుగానే ఉండేదని తెలిపారు. దీన్ని పునరుద్ధరించడం ద్వారా బాలురకు అన్యాయం జరగకుండా కాపాడవచ్చన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు