కేవలం ముప్పై అంటే ముప్పై సెకన్లలో 10 యేళ్ల బుడతడు ఏకంగా రూ.10 లక్షలు కొట్టేశాడు. అనేక మంది సిబ్బంది, కస్టమర్లు ఉన్నా.. మరో కంటికి తెలియకుండా, రెప్పపాటులో డబ్బు దోచుకుని ఎంచెక్కా పారిపోయాడు. అయితే, మూడో నేత్రంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల కంటి నుంచి మాత్రం తప్పించుకోలేక పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ జిల్లాలోని బ్యాంకులో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ పదేళ్ల కుర్రాడు.. పట్ట పగలు.. అందరి కళ్లూ కప్పి ఏకంగా 10 లక్షల రూపాయల బ్యాంకు సొమ్మును దోచేశాడు. క్యాషియర్‌లేని సమయంలో మెల్లగా క్యాబిన్‌లో దూరి చకచకా డబ్బుల కట్టలను దొంగిలించి పరుగు పరుగున గేటు దాటేశాడు.
ఆ సయమంలో కౌంటర్ వద్ద ఓ కస్టమర్ కూడా ఉన్నాడు. ఇతర వినియోగదారులతో బ్యాంకు అంతా హడావుడిగా ఉంది. అయినా కూడా బుడతడి చేతి వాటాన్ని ఒక్కరూ గమనించలేకపోయారు. బుడ్డోడు భూమికి జానెడు ఎత్తే ఉండటంతో క్యాబిన్ బయటున్న కస్టమర్ లోపల ఏంజరుగుతోందో కనిపెట్టలేకపోయాడు.
అయితే.. పారిపోయే సమయంలో పిల్లోడి కంగారు చూసి సెక్యూరీటీకి అనుమానమొచ్చి అతడిని వెంబడించారు. కానీ ఉపయోగం లేకపోయంది. అప్పటికే మనోడు డబ్బుతో జంప్ అయిపోయాడు. దీంతో అధికారులు, పోలీసులూ ఒక్కసారిగా షాక్.
ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఓ 20 ఏళ్ల యువకుడు బ్యాంకులోనే మకాం వేసి బుడ్డోడిని డైరెక్ట్ చేస్తూ కథంతా నడిపించాడని తెలిసి పోలీసులు అవాక్కాయ్యారు. ఈ విచారణ సందర్భంగా ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
స్థానికంగా ఉండే ఓ ముఠా ఈ చోరీకి స్కెచ్ వేసిందని, పిల్లల సాయంతో క్షణాల్లో పని పూర్తి చేసిందని బయటపడింది. అంతేకాదు.. ఇలా పిల్ల దొంగల సాయంతో చోరీలకు పాల్పడటంలో ఆ ముఠా ఆరితేరిందని కూడా వారు తెలుసుకున్నారు.
పిల్ల దొంగల చేత ఇలాంటి రిస్కీ పనులు చేయించేందుకు ఆ ముఠాకు పెద్ద కారణమే ఉందట. ఒక వేళ్ల ఈ బుడ్డోళ్లు పోలీసుల చేతికి చిక్కినా కూడా బాల నేరస్తులు కావడంతో కొద్ది పాటి శిక్షలతోనే బయటపడతారని ఇలాంటి స్కీమ్‌ను ఆ ముఠా అమలు చేస్తోందట.
ఇక చోరీకి ముందు ఈ ముఠా రెక్కీ కూడా నిర్వహించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది కాబట్టి ఈ కథ సశేషం అనుకోవాల్సిందే.