తండ్రిలేని తొలి బిడ్డగా తమిళనాడుకు చెందిన తావిసి రికార్డులకెక్కింది. తావిసి బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టాలని మద్రాస్ హైకోర్టు అధికారులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. పరస్పర అంగీకారంతో తావిసి తల్లిదండ్రులు వేరయ్యారు. ఆపై ఓ వీర్యదాత ద్వారా మధుమిత ఏప్రిల్ 2017లో తావిసికి జన్మనిచ్చింది.
త్రిచి కార్పొరేషన్ అధికారులు తావిసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తూ మనీష్‌ను చిన్నారి తండ్రిగా పేర్కొన్నారు. సంతానోత్పత్తి చికిత్స కోసం మధుమితకు సాయం చేసిన మనీష్ పేరును బర్త్ సర్టిఫికెట్‌లో చేర్చారు. దీన్ని నిరసిస్తూ తావిసి తల్లి మధుమిత కోర్టును ఆశ్రయించారు. దీంతో తావిసి తండ్రి కాలమ్ నుంచి మనీష్ పేరును తొలగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
మరోవైపు తావిసి తండ్రిని తాను కాదంటూ మనీష్, మధుమిత నుంచి విడిపోయిన భర్త చరణ్ రాజ్‌లు విడివిడిగా కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో స్పందించిన జస్టిస్ ఎంఎస్ రమేష్ నేతృత్వంలోని ధర్మాసనం త్రిచీ కార్పొరేషన్ ముఖ్య వైద్యాధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.