అవి నీచమైన వ్యాఖ్యలు... నటి కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం : మద్రాస్ హైకోర్టు

ఠాగూర్

శుక్రవారం, 15 నవంబరు 2024 (13:59 IST)
సినీ నటి కస్తూరిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలను నీచాతి నీచంగా పోల్చారు. అవమానకరమైనవంటూ పేర్కొంది. అందువల్ల ఆమె న్యాయ విచారణ  ఎదుర్కోవాల్సిందేనంటూ స్పష్టం చేస్తూ, ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 
 
కాగా, రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి పట్ల మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ విద్వేష ప్రేరేపితమేనని తేల్చిచెప్పింది. ఇటీవల చెన్నైలో నిర్వహిం చిన ఓ కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. 
 
దీనిపై తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదవ్వగా, ముందస్తు బెయిల్ కోసం కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలోని మదురై ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే కస్తూరి క్షమాపణ చెప్పినందున కేసుల్ని కొట్టివేయాలని ఆమె తరపు న్యాయవాది అభ్యర్థించగా, జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని
ప్రభుత్వం తరపు న్యాయవాది తేల్చిచెప్పారు. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందిం చింది. 'వాక్ స్వాతంత్ర్యం అనేది వ్యక్తు తమ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఉన్న ప్రాథమిక హక్కు. అయితే ఆ మాటలు విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికో, లేదా మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికో దుర్వినియోగం చేయకూడదు. కస్తూరి వ్యాఖ్యలు ముమ్మాటికీ హింసను ప్రేరేపించేవిలా ఉన్నాయి. బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సింది. 
 
ఆమె మాట్లాడినప్పుడు ప్రేక్షకులు నుంచి చప్పట్లు ఉండవచ్చు. కానీ, ఆ మాటలు తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది మొత్తం తెలుగు ప్రజలను కించపరచినట్లయింది. మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి నీచమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినవారెవరైనా చట్టప్రకారం విచారణను ఎదుర్కోవాల్సిందే' అని ధర్మాసనం తేల్చిచెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు