తమిళ సినీ నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు చెన్నై, మదురైలలో కేసులు నమోదైవున్నాయి. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదేసమయంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం ఆమె మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మానసం పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు గురువారం నటి కస్తూరికి తేరుకోలేని షాకిచ్చింది.
కాగా, ఈ నెల మూడో తేదీన చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడుతూ.. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు.
తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కస్తూరి క్షమాపణలు తెలిపారు. కొంతమందిని ఉద్దేశించి మాత్రమే తానా వ్యాఖ్యలు చేశానని, తెలుగు ప్రజలను ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. అయితే, ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.