ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన సిట్టింగ్ ఎంపీ!!

వరుణ్

మంగళవారం, 26 మార్చి 2024 (16:55 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్లీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థానానికి లోనైన సిట్టింగ్ ఎంపీ ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన పేరు ఏ.గణేశపూర్తి. ఈరోడ్ సిట్టింగ్ ఎంపీ. ఎండీఎంకే పార్టీ తరపున లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. డీఎంకే కూటమిలో ఓ పార్టీగా ఉన్న ఎండీఎంకే... సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేస్తుంది. ఇందులో ఈరోడ్ స్థానం కూడా ఉంది. ఈ టిక్కెట్‌ను మళ్లీ తనకు కేటాయించకపోవడంతో ఆయన తీవ్ర మనస్థానానికి లోనయ్యాడు. 
 
76 యేళ్ల గణేశపూర్తికి ప్రస్తుతం జరుగనున్న లోక్‌‍సభ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన పురుగుల మందును నీటిలో కలుపుకొని తాగారు. వాంతులు చేసుకుంటున్న ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కోయంబత్తూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
పార్టీ ప్రధానకార్యదర్శి వైగో ఆదివారం రాత్రి కోయంబత్తూరు ఆస్పత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వడం కుదరకపోతే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలోకి దించుదామని నిర్ణయించామని, ఈలోపే ఆయన ఆత్మహత్యకు యత్నించారని వైగో విలేకరులకు చెప్పారు. 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారన్నారు. ఆయన మూడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని వైగో గుర్తుచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు