జయ అపస్మారకంగా ఉంటే వేలిముద్ర ఎలా వేశారు? స్టాలిన్ పది ప్రశ్నలు

శనివారం, 30 సెప్టెంబరు 2017 (10:26 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం ఇపుడు తమిళ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది. గత యేడాది డిసెంబర్ 5వ తేదీన జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 
 
ఈనేపథ్యంలో సాక్షాత్ రాష్ట్ర మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలతో పాటు అపోలో ఆస్పత్రి పేషెంట్ కేర్ రిపోర్టును ఓ తమిళ చానెల్ బహిర్గతం చేయడంతో అమ్మ మరణం ఇపుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత ఎంకే స్టాలిన్ పది ప్రశ్నలతో ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
జయలలితను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చినప్పుడు ఆమె భద్రతా విభాగంలోని అంబులెన్స్‌లో కాకుండా అపోలో ఆస్పత్రికి చెందిన ప్రైవేటు అంబులెన్స్‌లో ఎందుకు తరలించాల్సి వచ్చింది? కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలోని జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన జయలలిత కాన్వాయ్ వెంట ఉండే అంబులెన్స్ ఏమైంది అని ప్రశ్నించారు. 
 
జయ ఆసుపత్రిలో ఉన్న 75 రోజులు ఆమె జడ్ ప్లస్ భద్రతా సిబ్బంది ఏమైపోయ్యారు. ఆమె ఆరోగ్యంపై కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించారా లేదా? సమర్పించి ఉంటే జయ ఆరోగ్యం గురించి కేంద్రానికి పూర్తి వివరాలు తెలుసా? శశికళ కూడా అక్టోబరు మొదటివారం నుంచి జయను చూడలేదని దినకరన్‌ అన్నారు. అలాంటప్పుడు తిరుప్పరంకుండ్రం ఉప ఎన్నికలో బీఫారం పత్రాలపై జయ వేలిముద్ర ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసేవారు ఆమె చుట్టూ, ఆమె మంత్రివర్గంలో, సచివాలయంలో ఎవరైనా ఉన్నారా? ఇదే నిజమైతే ఏయే పథకాలకు ఆ సంతకాన్ని ఫోర్జరీ చేశారు? పదవుల పంపకం కోసమే జయ ఆరోగ్యంపై 75 రోజులపాటు నాటకం ఆడారా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. 
 
ముఖ్యంగా జయలలిత అపస్మారక స్థితిలో ఉంటే ఆమె శాఖల నిర్వహణ బాధ్యతలను ఓ.పన్నీర్‌సెల్వానికి ఎలా అప్పగించారని ప్రశ్నించారు. తాను లేవనెత్తిన ఈ ప్రశ్నలు తాను వ్యక్తిగతంగా అడుగుతున్నవి కావని, ఇన్ని రోజులుగా ప్రజల మనసుల్లో అనుమానాలుగా మిగిలిపోయిన వాటిని మాత్రమే తాను అడుగుతున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. జయ మరణంపై ఇప్పటికైనా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు