అమ్మకూ ఓ తోడు కావాలి.. తల్లికి పెళ్లి చేసిన తనయులు... ఎక్కడ?

సోమవారం, 20 మార్చి 2023 (13:58 IST)
భర్త చనిపోయిన మా కన్నతల్లికి కూడా ఓ తోడు కావాలని పెద్దమనస్సుతో ఆలోచన చేసిన ఇద్దరు కుమారులు.. కన్నతల్లికి దగ్గరుండి మరీ పెళ్లి చేశారు. ఈ ఆశ్చర్యకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకుర్చి జిల్లా వలయంపట్టు అనే గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళ, భాస్కర్, వినయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె భర్త 2009లోనే చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ మగతోడు లేకుండా జీవిస్తుంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న తల్లికి తోడు కావాలని ఇద్దరు కుమారులు భావించారు. వారికి ఈ ఆలోచన వచ్చిందే తడవుగా తమ మనస్సులోని మాటను తల్లికి చెప్పారు. పైగా, నీవు పెళ్లి చేసుకుంటేనే తాము పెళ్లి చేసుకుంటామని షరతు విధించారు. 
 
అయితే, పెళ్లీడుకొచ్చిన కొడుకులను ఇంటిలో పెట్టుకుని తాను పెళ్లి చేసుకుంటే ఈ సమాజం అసహ్యించుకుంటుందని ఆమె పిల్లలకు చెపుతూ వాగ్వివాదానికి దిగింది. అయితే, కుమారులు మాత్రం పట్టు వీడలేదు. చివరకు కుమారుల ఒత్తిడితో ఆమె పెళ్లికి అంగీకరించింది. తన తల్లి అనుమతితో ఏళుమలై అనే రైతు కూలీని వరుడుగా ఎంపిక చేసి వివాహం జరిపించారు. అయితే, ఈ వివాహానికి బంధువులను కూడా ఆహ్వానించినప్పటికీ వారిలో ఒక్కరు కూడా రాలేదు. అయినప్పటికీ అన్నదమ్ములు ఏమాత్రం వెనుకంజ వేయకుండా తమ తల్లికి రెండో పెళ్లి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు