రాహుల్‌ది ఐరెన్ లెగ్... ఓటమిని అంగీకరించిన అఖిలేష్... ములాయం వర్గం ఫైర్

శనివారం, 11 మార్చి 2017 (14:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార ఎస్పీ చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లేనని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీది ఐరెన్ లెగ్ అని, గతంలో తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే, నేడు యూపీలో అఖిలేష్ యాదవ్‌లు చిత్తుగా ఓడిపోయారని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు.. ఓటర్ల తీర్పును ఎస్పీ అంగీకరించింది. 
 
యూపీ ఎన్నికలకు ముందు తండ్రి ములాయం సింగ్ యాదవ్, కొడుకు అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు కనిపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పాటు కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. అఖిలేష్ వర్గం ములాయం వర్గాన్ని పక్కన పెట్టి ముందుకెళ్లిందని, అందుకే ఈ ఫలితం అని ములాయం సింగ్ వర్గం మండిపడుతోంది. అఖిలేష్ యాదవ్ ఒంటెత్తు పోకడలు దెబ్బతీశాయని అగ్రహిస్తున్నారు. మమ్మల్ని రాహుల్ గాంధీయే దెబ్బతీశారని, అసలు ఆయనతో అఖిలేష్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఎస్పీ నేత మదుకర్ ప్రశ్నించారు.
 
అఖిలేష్ చివరి నిమిషంలో హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సమాజ్ వాది పార్టీని ఓటమిలోకి నెట్టారని ములాయం వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీతో ఎవరు కలువమన్నారు, ఎందుకు పోటీ చేశారని నిలదీస్తున్నారు. అఖిలేష్ తొందరపడ్డారని చెప్పారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం తమకు భయం లేదని బీజేపీ పలుమార్లు ఎద్దేవా చేసింది. గతంలో తమిళనాడులోను డీఎంకేను కాంగ్రెస్ ఓడించిందని, ఇపుడు ఎస్పీని చిత్తుగా ఓడించిందని వారు గుర్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి