ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని 'కమాండర్ ఇన్ థీఫ్'గా సంభోధించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేత పరువు నష్టం దావా వేసింది. మోదీని 'కమాండర్ ఇన్ థీఫ్'గా సంభోధించిన రాహుల్‌గాంధీకి ముంబయిలోని గిర్గావ్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 3వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు రఫేల్ ఒప్పందంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య మాట తూటాలు పేలిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌తో జరిగిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్నే రాహుల్ ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నారు.
‘ఆయన వ్యాఖ్యలు ఒక్క ప్రధానినే కాదు, భాజపా కార్యకర్తందరినీ అవమానించినట్లు ఉన్నాయి. గతంలో కూడా రాహుల్ ‘కాపలాదారుడే దొంగ’ అని మోదీని పదేపదే విమర్శిస్తూ అగౌరవ పరిచారు’ అంటూ తన పిటిషన్‌లో కోర్టుకు తెలియజేశారు.