కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను ఓ మహిళ కళ్లకు కట్టినట్టు వివహించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి 370 ఆర్టికల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కాశ్మీర్ లోయలో శాంతిభద్రత పరిరక్షణ పేరుతో భారీగా భద్రతా బలగాలను మొహరింపజేశారు. కానీ విపక్ష పార్టీలు మాత్రం కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో విపక్ష నేతలు జమ్మూకాశ్మీర్‌లో పర్యటించాలనుకున్నారు. కానీ, భద్రతా కారణాలరీత్యా అధికారులు వారి పర్యటనను అడ్డుకున్నారు. దీంతో తిరుగు ప్రయాణమైన రాహుల్ బృందానికి విమానంలో ఊహించని ఘటన ఎదురైంది. విండో సీట్‌లో కూర్చున్న రాహుల్ దగ్గరికొచ్చిన ఓ కాశ్మీరీ మహిళ వారు పడుతున్న బాధలను గూర్చి తెలిపింది.
ఇంటి నుంచి బయటికొచ్చే పరిస్థితులు లేవనీ, కనీస వస్తువులు తెచ్చుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతున్నామని వాపోయింది. 'నా సోదరుడు గుండె సంబంధిత వ్యాధితో భాదపడుతున్నాడనీ, కనీసం మందులు తెచ్చుకోవడానికి సైతం బయటికెళ్లలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నామని' ఆమె తనలోని ఆవేదనను వెళ్ళగక్కింది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. విపక్ష బృందంలో రాహుల్‌తో పాటు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కేసీ శర్మ, కేసీ వేణుగోపాల్ మిగతా నేతలు ఉన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాధికా ఖేరా ట్విట్టర్‌లో పోస్టు చేయగా, అది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.