తుపానుపై వదంతులు నమ్మొద్దు.. మరో 72 గంటలు వర్షాలు : బీఎంసీ

గురువారం, 21 సెప్టెంబరు 2017 (07:41 IST)
వరుణుడి ప్రతాపంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. మంగళవారం రాత్రి నుంచి నిర్విరామంగా కుంభవృష్టి కురుస్తోంది. రానున్న 72 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఏమాత్రం విశ్రాంతి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. 
 
ఓ పక్క సహాయచర్యలు కొనసాగుతుండగానే.. వాతావరణ శాఖ మళ్లీ భారీ వర్ష సూచన చేయడంతో బీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ముంబైపై తుపాను ప్రభావం చూపనుందని సోషల్‌మీడియాలో వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై బీఎంసీ అధికారులు స్పందిస్తూ.. తుపానుకు సంబంధించి వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవని బీఎంసీ డిప్యూటీ కమిషనర్‌ సుధీర్‌ నాయక్‌ తెలిపారు. ప్రజలు ఇలాంటి వందతులు నమ్మొద్దని కోరారు. 
 
వర్షాల వల్ల ముంబయిలో రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసివేయడంతో 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని లోకల్‌ రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని రద్దు చేశారు.
 
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు ప్రకటించారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన రన్‌వేను మూసివేశారు. ఇక్కడ కేవలం రెండో రన్‌వే మాత్రమే పనిచేస్తోంది. ఇప్పటికే ఒక విమానం ప్రధాన రన్‌వే‌పై అదుపుతప్పడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 50 విమాన సర్వీసులను రద్దు చేశారు. స్పైస్‌ జెట్‌, ఇండిగో సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. 

 

Is this Mumbai Airport runway during #MumbaiRains #MumbaiAirport #MumbaiRain pic.twitter.com/A85Jr0qUbt

— Buzz Laundry (@BuzzLaundry) September 20, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు