భర్త గుండెలపై కూర్చొని గొంతుపిసికి చంపేసిన భార్య... ఎన్డీతివారీ కోడలి ఘాతుకం

శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ.తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు... ఆయన అనారోగ్యంతో మరణించలేదనీ హత్య చేసి చంపేశారనీ తేల్చారు. ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితురాలు రోహిత్ భార్య అపూర్వ శుక్లా అని తేల్చారు. అయితే, ఇంతటి అనర్థానికి కారణం ఆమె తన భర్తకు చేసిన ఒకే ఒక్క వీడియోకాల్ అని చెప్పారు. భర్త రోహిత్ శర్మను అపూర్వ హత్య చేయడానికి గల కారణాలను ఢిల్లీ పోలీసులు వివరించారు. 
 
ఈనెల 15వ తేదీన ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి రోహిత్ శర్మ కారులో బయలుదేరాడు. రాత్రి భోజనం గురించి అడిగేందుకు భర్తకు వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో మరో మహిళ ఉండటాన్ని అపూర్వ చూసింది. ఇంటికి వచ్చాక.. మద్యంమత్తులో ఉన్న భర్తకు అపూర్వ భోజనం వడ్డించింది. భోజనం చేసి తన గదికి వెళ్లి పడుకున్నాడు. 
 
అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కారులో ఉన్న మరో మహిళ ఎవరు అని భర్తను అపూర్వ నిలదీసింది. దీనికి సమాధానమిస్తూ ఆమె తనకు తెలిసిన మహిళ అని.. తామిద్దరం కారులో వస్తూ ఒకే గ్లాసులో మద్యం సేవించినట్టు సమాధానమిచ్చాడు. అంతే.. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తురాలైన అపూర్వ.. మంచంపై పడుకునివున్న భర్త గుండెలపై కూర్చొని పీక గట్టిగా పట్టుకుంది. దీంతో అసలే మద్యం సేవించి ఉండటంతో పాటు రోహిత్‌ బలహీనంగా ఉండటంతో ఊపిరాడలేదు. దీంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. 
 
రోహిత్ మరణించాడన్న విషయం తెలుసుకున్న తర్వాత కూడా అపూర్వ ఏ మాత్రం తొణకలేదు బెణకలేదు. ఉదయం 9 గంటలకు ఇంటి పనిమనిషి వచ్చి రోహిత్ గదిలోకి వెళ్లి చూడగా అతను పడుకునివున్నాడు. దీంతో రోహిత్ నిద్రపోతున్నాడని భావించి గదిని శుభ్రం చేసి బయటకు వచ్చింది. 
 
మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి ఉజ్వల కొడుకు ఇంటికి వెళ్లింది. శేఖర్‌తో మాట్లాడాలని నిద్రలేపమని కోడలికి చెప్పింది. ఆమె ఏం తెలియనట్టుగా రోహిత్ గదికి వెళ్లి ఆయన్ను లేపినట్టుగా నటించి.. రోహిత్ ఎంతకీ లేవడం లేదని, ముక్కులో నుంచి రక్తంలోకారుతోందని చెప్పింది. పైగా, నోట్లో నుంచి రక్తంకారుతుందని చెప్పి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ రోహిత్‌ను పరిశీలించిన వైద్యులు.. అతను మరణించినట్టు నిర్ధారించారని పోలీసులు వివరించారు. ప్రస్తుతం అపూర్వను పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు