తమిళనాడు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులోభాగంగా ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా కొనసాగుతున్న నజ్మాహెప్తుల్లాతో పాటు.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్, టీడీపీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుమల్లి నర్శింహులు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య పదవీ కాలం గత ఆగస్టు 30వ తేదీతో ముగిసింది. సాధారణంగా ఒక గవర్నర్ పదవీకాలం ముగియగానే కొత్త గవర్నర్ పేరును ప్రకటించాల్సి వుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ విద్యాసాగర్‌రావుకు తమిళనాడు ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తడం, రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముండడంతో ఇక్కడ పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాలని కేంద్రం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది.
అయితే తమిళనాడుకు మహిళనే గవర్నర్‌గా నియమించాలని ప్రధాని భావిస్తున్నారని, నజ్మాహెప్తుల్లా, ఆనందిబెన్‌ల పేర్లు ముందువరుసలో ఉన్నప్పటికీ... బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉండటంతో టీడీపీ తెలంగాణ నేత మోత్కుపల్లి నర్శింహులు పేరును రాష్ట్ర గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.