నిర్భయ కేసులోని దోషులందర్నీ ఒకేసారి ఉరితీయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం వారం రోజుల సమయం ఇచ్చింది. మరోవైపు, నిర్భయ హత్యాచార దోషులకు ఉరి అమలుపై ట్రయల్‌కోర్టు విధించిన స్టేను ఎత్తేసేందుకు నిరాకరించింది.
దోషులను ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 6 గంటలకు ఉరితీయాలని ఢిల్లీలోని పటియాలా కోర్టు గతంలో రెండోసారి డెత్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే తామంతా న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవాలని, డెత్ వారెంట్ అమలు చెల్లదని పేర్కొంటూ దోషులు పిటిషన్ పెట్టుకున్నారు. దాంతో ఉరి ఆగిపోయింది.
ఈ సందర్భంగా జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవితానికి రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛలను కల్పించేలా ఉందన్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన నేరాలకు పాల్పడ్డవారు రక్షణ పొందుతున్నారని, ఈ ఆర్టికల్ కింద వారికి బతికున్నంతకాలం రక్షణ లభిస్తుందని జడ్జి వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ హైకోర్టు తమ పిటిషన్‌ను తిరస్కరించడంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మరోవైపు నలుగురు నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్ సింగ్ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం రాత్రి తిరస్కరించారు. దీంతో పవన్‌గుప్తా అనే ఒకే ఒక దోషి క్షమాభిక్షకు దరఖాస్తు చేయాల్సి ఉంది. అతను కూడా ఈ పిటిషన్‌ను వారం రోజుల్లో పెట్టుకోవాల్సివుంది. లేనిపక్షంలో వారం రోజుల తర్వాత నిర్భయ దోషులు ఉరికంభాని వేలాడనున్నారు.