సీఎం నితీశ్‌పై అలక.. జేడీయుకు శరద్ యాదవ్ రాజీనామా?

ఆదివారం, 16 జులై 2017 (13:40 IST)
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై జేడీయు అధినేత శరద్ యాదవ్ అలకబూనారు. దీంతో అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీహార్‌లో జనతాదళ్ (యు)తో పాటు.. ఆర్జేడీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నాయి. అయితే, ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్‌ తక్షణం రాజీనామా చేయాలని, ఈ మేరకు సీఎం నితీశ్ కుమార్ ఒత్తిడి చేస్తున్నారు. ఇది శరద్ యాదవ్‌కు ఏమాత్రం నచ్చడం లేదు. 
 
అదేసమయంలో నితీశ్ కుమార్ బీజేపీ పట్ల సానుకూలత కనబరుస్తుండటంపై కూడా శరద్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీజేపీతో చేతులు కలపడం ఆత్మహత్యా సదృశమని వాదిస్తున్న జేడీయూ నేతలతో శరద్ యాదవ్ మంతనాలు జరుపుతున్నారు. నితీశ్ కుమార్ బీజేపీకి దగ్గరైతే తాను జేడీయూకు రాజీనామా చేస్తానని శరద్ యాదవ్ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇదే జరిగితే జేడీయులో అంతర్గత సంక్షోభం తప్పదని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి