చైనా కంపెనీలకు కేంద్రం మరోమారు షాకిచ్చింది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి చేసిన దాడిలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రజలు చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 59 రకాల చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. వీటికి ప్రతిగా చైనా దేశంలో భారత వెబ్‌సైట్లు, పత్రికలపై నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చేపడుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను కానీ, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కానీ అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
మన దేశానికి విదేశీ టెక్నాలజీ అవసరమైన సందర్భాల్లో కూడా చైనా పెట్టుబడిదారులను అనుమతించబోమన్నారు. చైనా నుంచి వస్తున్న దిగుమతులపై చెన్నై, విశాఖపట్నం పోర్టుల్లో కస్టమ్స్ నిఘాను ముమ్మరం చేశామని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.