కొత్త మోటారు వాహన చట్టం : కేంద్రమంత్రి కారుకు అపరాధం

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (11:08 IST)
దేశంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ఇది వాహనదారుల్లో గుబులురేపుతోంది. వేలాది రూపాయల జరిమానాలు చెల్లించలేక వాహనదారులు లబోదిబోమంటున్నారు. అయితే, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికైనా జరిమానా తప్పదని పోలీసులు మరోమారు నిరూపించారు. 
 
ఇందులోభాగంగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కారుకే జరిమానా విధించారు. ముంబైలోని బాంద్రా - వర్లీ ప్రాంతంలో కారును అతివేగంగా నడిపినందుకు పోలీసులు చలానా పంపారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంద రోజుల పాలన గురించి వివరిస్తూ ఆయనీ విషయాన్ని చెప్పుకొచ్చారు.
 
ప్రమాదాల నివారణ కోసమే మోటారు వాహనాల సవరణల చట్టం తీసుకొచ్చామని, ఇది తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని వివరించారు. భారీ జరిమానాల వల్ల పారదర్శకత పెరుగుతుందని, అవినీతికి తావుండదన్నారు. కారు వేగంగా నడిపినందుకు తాను కూడా జరిమానా కట్టాల్సి వచ్చిందని గడ్కరీ వాపోయారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారికి ఎటువంటి భయం అవసరం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు