రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం... 12 పార్టీల నోటీసు

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:37 IST)
రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఈ తీర్మాన ప్రతిలో తెరాసకు చెందిన ఎంపీలతో పాటు.. మొత్తం 12 పార్టీలకు చెందిన 50 మందికిపై సభ్యులు సంతకాలు చేశారు. దీంతో ఈ అవిశ్వాస తీర్మానం సోమవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను సభలో ప్రవేశపెట్టి, వాటిపై ఓటింగ్ జరుపకుండానే హడావుడిగా ఆమోదింపజేశారని హరివంశ్‌పై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించాల్సిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ దానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, ప్రక్రియలకు హాని కలిగించిన విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ విమర్శించారు. 
 
చరిత్రలో ఈ రోజు 'బ్లాక్ డే' గా మిగులుతుందని అన్నారు. వ్యవసాయ బిల్లులు ఆమోదించబడిన విధానం ప్రజాస్వామ్య ప్రక్రియలకు వ్యతిరేకంగా ఉన్నదని, ఇది ప్రజాస్వామ్యం కూనీకి సమానమని ఆయన ఆరోపించారు. అందుకే డిప్యూటీ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా 12 ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయని అహ్మద్ పటేల్‌ తెలిపారు.
 
కాగా, రాజ్యసభ ఆదివారం గందరగోళ పరిస్థితులతో హోరెత్తింది. వ్యవసాయ బిల్లుల‌ను హ‌డావుడిగా పాస్ చేసేందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రయత్నించారు. స‌వ‌ర‌ణ‌ల‌పై స‌భ్యుల వివ‌ర‌ణ తీసుకోకుండానే వాయిస్ ఓటుకు వెళ్లారు. దీంతో టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ డిప్యూటీ ఛైర్మన్ చైర్ వైపు దూసుకువెళ్లారు. త‌న చేతిలో ఉన్న రూల్ బుక్‌ను ఆయనకు చూపించే ప్రయత్నం చేశారు.
 
కొందరు ఎంపీలు కూడా పోడియం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్య డిప్యూటీ ఛైర్మన్ వాయిస్ ఓటు ద్వారా అగ్రి బిల్లుల‌ను పాస్ చేసి సభను సోమవారానికి వాయిదా వేశారు. డిప్యూటీ ఛైర్మన్ తీరుపై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు