బెంగుళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారం అధికారులు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఓ లేఖ రాశారు. పర్పపణ అగ్రహార జైలులో తనకు ప్రాణహాని ఉందని, తాను ఇక్కడుంటే ఖచ్చితంగా చంపేస్తారని, అందువల్ల తనను చెన్నై జైలుకు మార్చాలంటూ ఆమె సోమవారం ఓ లేఖ రాశారు.
ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. దీంతో ఆమె పరప్పణ అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఈ జైలుల్లో తనకు ప్రాణహాని ఉందని, పైగా, తనకు ఇక్కడి వాతావరణం కూడా పడటం లేదని ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు.
దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్పందించారు. జైలులో శశికళకు ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టం చేశారు. ఆమెకు తగిన భద్రతను కల్పించివున్నారనీ, పైగా, ఇతర ఖైదీలతో కూడా ఆమెకు ఎలాంటి ముప్పు లేదని ఐబీ అధికారులు వెల్లడించారు.