నిన్ను పెళ్లి చేసుకుంటాగా, ఒప్పుకో: మహిళా ఎస్సైని లొంగదీసుకుని ఆపై...
మంగళవారం, 25 ఆగస్టు 2020 (17:12 IST)
ఒడిషా లోని గంజాం జిల్లాలోని ఖల్లికోట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వివాహం సాకుతో తన సహచర మహిళా ఎస్సైను లొంగదీసుకుని ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని ముఖం చాటేశాడు. దీనిపై మహిళా ఎస్సై ఫిర్యాదు చేసింది. కాగా తనను మోసం చేశాడన్న విషయాన్ని బయటకు చెబితే భయంకరమైన పరిణామాలు ఉంటాయని నిందితుడు ఆమెను బెదిరించాడు. దరింగిబాడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయిన ఈ మహిళ ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీసు స్టేషనుకి బదలీ అయిన నేపధ్యంలో న్యాయం కోరుతూ ఇక్కడి డిజిపి ముందు హాజరయ్యారు.
2017లో బిజు పట్నాయక్ స్టేట్ పోలీస్ అకాడమీలో తన శిక్షణ రోజులలో తనను పెళ్లి చేసుకుంటానని నిందితుడు తనకు ప్రతిపాదించినట్లు బాధితురాలు తెలిపింది. అయినప్పటికీ, తను తక్కువ కులం కారణంగా ఆమె ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. తరువాత, ఆమెను సంబల్పూర్ లోని జమాన్కిరా పోలీస్ స్టేషన్లో పోస్ట్ చేసినప్పుడు తనను సదరు ఎస్సై ఒప్పించి లొంగదీసుకుని తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. తను తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు, తనను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేయడంతో అంగీకరించినట్లు తెలిపింది.
“తరువాత, అతను మరొక అమ్మాయిని వివాహం చేసుకోవడం గురించి తెలుసుకున్నప్పుడు, నన్ను వివాహం చేసుకోవాలని నేను అతనిని సంప్రదించాను. కానీ అతను నేను తక్కువ కులానికి చెందినదాన్నంటూ నిరాకరించాడు. కందమాల్‌లోని సారంగడ పోలీస్‌స్టేషన్‌లో నేను ఎస్‌ఐపై ఫిర్యాదు చేసినప్పుడు, అతని కుటుంబ సభ్యులు నా వద్దకు వచ్చి కేసును పరిష్కరించుకోవాలని నన్ను అభ్యర్థించారు. మా వివాహానికి వాగ్దానం చేశారు. పోలీసుల ముందు నా స్టేట్మెంట్ మార్చమని వారు నన్ను కోరారు” అని ఆ మహిళ తెలిపింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ, " ఆ తర్వాత అతను నన్ను ఒక ఆలయానికి తీసుకువెళ్ళాడు. మేము అక్కడ వివాహం చేసుకున్నాము. తరువాత, నేను సెక్షన్ 162 కింద జిల్లా మేజిస్ట్రేట్ ముందు నా స్టేట్మెంట్ మార్చాను. కొన్ని రోజుల తరువాత, అతను నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని ఆచూకీ నాకు ఇంకా తెలియదు.” తనను మోసం చేసిన అతడిపై పలు సెక్షన్లపై కేసులు పెట్టినట్లు బాధిత మహిళ వెల్లడించింది.
తనకు న్యాయం జరగడానికి సమగ్ర దర్యాప్తు తర్వాత నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిజిపిని సంప్రదించారు. ఈ కేసుపై గంజాం ఎస్పీ బ్రిజేష్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. నిందితుడు చాలా కాలం నుండి సెలవులో ఉన్నాడు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామని, అతడు దోషిగా తేలితే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.