రైతు ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకు పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్??

గురువారం, 10 డిశెంబరు 2020 (14:22 IST)
ప్రస్తుతం దేశంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. గత 15 రోజులుగా ఈ పోరాటం తారాస్థాయిలో జరుగుతోంది. రైతులు చేపట్టిన ఆందోళనలకు బీజేపీ మినహా దేశం మొత్తం మద్దతుగా నిలుస్తోంది. రైతులను శాంతింపజేసేందుకు కేంద్రం జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. పైగా, ఆందోళనలను మరింత తీవ్రతరం చేయాలని రైతులు భావిస్తున్నారు. 
 
పైగా, భారత రైతులు చేపట్టిన ఆందోళనలపై బ్రిటన్ వంటి ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో రైతు ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ దృష్టిని మరల్చేందుకు కేంద్రం మరోమారు సర్జికల్ స్ట్రైక్స్ జరిపేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ మేరకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఒక కీలక నివేదికను ఆ దేశ ప్రభుత్వానికి అందించింది. రైతు ఆందోళనల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. 
 
భారత సైన్యం విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. సరిహద్దుల్లో సైన్యాన్ని అలర్ట్ చేయాలని సూచించింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని ప్రముఖ పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ముఖ్యంగా, భారత్‌లోని నిరసనలను బలహీనపరిచేందుకు హిందుత్వవాది అయిన ప్రధాని నరేంద్ర మోడీ ఏమైనా చేయడానికి సిద్ధపడతారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. రైతుల ఉద్యమం మరో ఖలిస్థాన్ ఉద్యమంలా మారేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోదని వ్యాఖ్యానించింది. భారత్ ఎలాంటి దాడులకు యత్నించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాక్ సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని తెలిపింది. 
 
మరోవైపు జియో న్యూస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించింది. అంతరంగిక సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు పాక్‌పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
మొత్తంమీద స్వదేశంలో ఒక సమస్య తీవ్రరూపం దాల్చితే దాన్ని నుంచి దృష్టిమరల్చేందుకు సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని కేంద్రం ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇదే తరహా స్ట్రైక్స్ నిర్వహించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు