బీజేపీ అధికారంలోకి రాకుంటే పాకిస్థాన్ దాడి చేస్తుంది : బీజేపీ మంత్రి

సోమవారం, 4 మార్చి 2019 (16:39 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సంబంధాలపై బీజేపీ నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా అస్సాంలో అధికార బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుంటే భారత్‌పై పాకిస్థాన్ దాడి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
నాగోన్ జిల్లా కాంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న శర్మ మాట్లాడుతూ, 'వచ్చే ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురాకపోతే పాకిస్థాన్ ఆర్మీ లేదా ఉగ్రవాదులు భారతీయ పార్లమెంట్‌తో పాటు అస్సాం అసెంబ్లీపై దాడి చేస్తారు. మోడీలాంటి బలమైన నేత ప్రధానమంత్రిగా ఉంటేనే దేశంపై ఎలాంటి దాడులు జరగకుండా మనం ప్రతిఘటించగలం. మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే మనం పాకిస్థాన్‌ను ఎదుర్కోలేం. ఈ దేశానికి మోడీలాంటి ప్రధాని అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 130 మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. బీజేపీ అధినాయకత్వంలో మనమంతా ఐక్యతగా లేకపోతే 'పాకిస్థాన్ జిందాబాద్' అనే ఇలాంటి దుష్టశక్తులు అస్సాంలో ఏదో ఒక రోజు విధ్వంసం సృష్టించడం ఖాయం. అందుకే మన యుద్ధం అభివృద్ధి మీదే కాదు. రాజకీయ గుర్తింపుతో కూడిన అభివృద్ధిపై అని గుర్తించాలి. అధికారం ఒకరి చేతిలో ఉన్నప్పుడే మనం అభివృద్ధిపైగానీ, ఇతర శక్తులపైగానీ యుద్ధం చేయగలం' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి