ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్థాన్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు భేటీ అయ్యారన్నారు. పాక్ నేతలతో కాంగ్రెస్ నేతల భేటీపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని ప్రధాని డిమాండ్ చేశారు. ప్రధాని నీచమైన వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించడంపై మోడీ నిప్పులు చెరిగిన విషయం విదితమే. పాక్ నేతలతో భేటీ అయిన మరుసటి రోజే అయ్యర్ తనపై అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు.
మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాక్ హై కమిషనర్, పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమైనట్లు శనివారం మీడియాలో కథనాలు వచ్చాయని ప్రధాని గుర్తు చేశారు. ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు జరిగిందని మోడీ వెల్లడించారు. పాక్ నేతలతో కాంగ్రెస్ నేతల భేటీని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు మోడీ.. దీనిపై భారత ప్రజలకు కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా అహ్మద్ పటేల్‌ను నియమించాలని పాకిస్థాన్ ఆర్మీకి చెందిన మాజీ డీజీ కాంగ్రెస్ పార్టీకి సూచన చేశారని ఆరోపించారు. కాగా, ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్న విషయం తెల్సిందే.