ప్రమాణ స్వీకారం చేసిన గంటలోనే పన్నీర్‌ని ఒంటరిని చేసిన ఘటనకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి పథక రచన చేశారు. 15 రోజుల్లోపు శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవలసిందిగా గవర్నర్ సమయం ఇస్తే రెండురోజుల్లో నిరూపించుకుంటానని చెప్పిన పళని అటు గవర్నర్‌కు, ఇటు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకి షాక్ కలిగించారు. శరవేగంగా పళని స్వామి తీసుకున్న ఈ నిర్ణయానికి చిన్నమ్మ వ్యూహమే కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 15 రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలను కూడగట్టి వారి ఒత్తిడితో ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవచ్చనుకున్న సెల్వంకి అదిలోనే భంగపాటు ఎదురుకావడానికి వెనుక చిన్నమ్మ ముందస్తు ఆలోచనే కారణమని తెలుస్తోంది.
పురచ్చి తలైవి జయలలిత సమాధి వద్ద నెచ్చెలి చిన్నమ్మ చేసిన శపథంలో మొదటి ఘట్టం విజయవంతమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సీఎం పీఠం దక్కకుండా చేశారు. శశికళ నమ్మిన బంటు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్నిగంటలకే బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. ఈనెల 18 తేదీనే అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు.. అదే రోజు బలాన్ని నిరూపించనున్నట్లు ప్రకటించారు.
శశికళ జైలుకు వెళ్లినా పన్నీర్‌కు పదవి దక్కకుండా చేసి తొలిపంతం నెగ్గించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్లే ముందే వ్యూహాత్మకంగా తన అనుచరులకు దిశా నిర్దేశం చేసి వెళ్లడం... ఆ తరువాత సీఎం, మంత్రులు ప్రమాణం చేయడంతో చిన్నమ్మ కారాగారం నుంచి ప్రభుత్వాన్ని నడపనుందని తేలిపోయింది.