గాఢంగా ప్రేమించుకున్నారు.. ఉన్నట్లుండి చనిపోయారు.. ఎవరు.. ఎక్కడ?

గురువారం, 29 నవంబరు 2018 (17:18 IST)
నిండా రెండు పదులు నిండలేదు. చదువులూ పూర్తి కాలేదు. పరీక్షలు రాయడానికి వెళ్ళి శవమై ఇంటికి చేరిందా ఆడబిడ్డ. ఉద్యోగంలో చేరి నెలైనా కాలేదు. కుదురుకోవడానికి ఇంకా సమయం చాలలేదు. బెంగుళూరులో బతకడానికి వెళుతున్నానని చెప్పి మృతదేహమై తిరిగొచ్చాడు యువకుడు. ప్రేమించుకున్నామని చెప్పి పోరాడి బతికే ఓపిక లేక బేలగా తొందరపడి రైలు పట్టాలపై తమను తాము బలి చేసుకుంది ఆ ప్రేమ జంట. ఒక్కటిగా కలిసి బతికే ధైర్యం చేయలేక, ఒక్కటిగా చావును కోరి రెండు కుటుంబాలకూ కడుపుకోత మిగిల్చింది ఆ జంట. క్షణికావేశంలో ప్రేమికులు తీసుకుంటున్న నిర్ణయాలు చివరకు విషాదాంతంగా మారుతున్నాయి.  
 
అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు. ఎంత కష్టమైనా పిల్లలను చదివించి వారిని ఉన్నతస్థానానికి తీసుకెళ్ళాలన్న ఉద్దేశం. 18 యేళ్ళ పాటు పిల్లలను చదివిస్తే చివరకు ప్రేమ పేరుతో ఎంతోమంది ఇళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ప్రేమికులు పెళ్ళి చేసుకుని జీవితాన్ని హాయిగా గడుపుతుంటే మరికొంతమంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రేమించి చివరకు పెద్దలు ఒప్పుకోక ఎన్నో జంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. 
 
తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రేమ జంట ఆత్మహత్య వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రేమ జంట కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా అత్తిమంజేరి గ్రామానికి చెందిన శంకర్, చిత్ర దంపతుల పెద్ద కుమార్తె మౌనీష, అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీదేవి, కుప్పుస్వామి దంపతుల పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. హేమంత్ కుమార్ కుటుంబం గత కొంతకాలంగా గ్రామం విడిచి ఊత్తుకోటలో నివాసముంటోంది.
 
సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన హేమంత్ కుమార్ బెంగుళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మౌనీషా ఆర్కాడ్ లోని ఉమెన్స్ కాలేజీలో బిఎస్పీ చదువుతోంది. రోజులాగే కాలేజీ బస్సు ఎక్కి మౌనీషా ఆర్కాడ్‌కు వెళ్ళింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకవపోడంతో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అదేరోజు రాత్రి తన తండ్రి కుప్పుస్వామికి ఫోన్ చేసి తాను హేమంత్ కుమార్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు హేమంత్ కుమార్ కూడా మూడురోజుల క్రితం తన తండ్రికి ఫోన్ చేసిన మౌనీషాతో ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. 
 
ఉద్యోగంలో చేరి నెల రోజులే అయ్యింది కాబట్టి ప్రేమ పెళ్ళి గురించి తరువాత మాట్లాడుకోవచ్చునని, ఇంటికి రావాలని తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పారు. అయితే హేమంత్, మౌనీషాలు రైలు ఎక్కి కుప్పం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రి వరకు ఆలోచనలో పడ్డ ప్రేమ జంట చివరకు రైలు పట్టాలపై తమ ప్రాణాలను తీసుకున్నారు. స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవచ్చని తల్లిదండ్రులు నచ్చజెప్పినా క్షణికావేశంలో వీరు తీసుకున్న నిర్ణయం చివరకు కుటుంబాల్లో విషాధాన్ని మిగిల్చింది.

ఎంతో సంతోషంగా ఉండే తమ పిల్లలు విగతజీవులుగా మారిపోవడాన్ని చూసిన తల్లిదండ్రులు నిశ్చేష్టులైపోయారు. ఆ ప్రాంతం మొత్తం విషాధకరంగా మారిపోయింది. ప్రేమించడం తప్పు కాదు.. అయితే తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవడం తప్పు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్ళి చేసుకుని హాయిగా జీవించాలే తప్ప జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవడం మంచిది కాదు. ప్రేమికుల్లారా..ఆలోచించండి..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు