ఇటీవలికాలంలో కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాదు.. మేధావులైన విద్యావంతులు కూడా తమ నోటి దూల కారణంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బేహార్ చేసిన చేసిన వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. దేశంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు మాంసాహార వినియోగమే కారణమంటూ ఆయన సెలవిచ్చారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మాంసాహారం కోసం అమాయక జంతువులను వధించడం వల్ల ప్రకృతితో వాటికున్న పరస్పర ఆధారిత సమతౌల్యం, అవినాభావ సంబంధం దెబ్బతింటుందని, ఫలితంగా పర్యావరణం విధ్వంసం జరుగుతుందని చెప్పారు. వీటి దుష్ప్రభావాలు తక్షణమే కనిపించకున్నా భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరో అడుగు మందుకేసి ఇకపై మాంసాహారం తీసుకోబమని విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ వ్యవహారం ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.