దేశవ్యాప్తంగా త్వరలోనే రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవే సంకేతాలు ఇచ్చారు. కొన్ని నియంత్రణలతో ఈ రవాణాకు అనుమతించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
గడ్కరీ బుధవారం నాడు భారత బస్, కార్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో మాట్లాడారు. బుధవారం గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరితో మాట్లాడారు. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారని తెలిసింది.
బస్సులు, కార్లు నడిపే క్రమంలో ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఫేస్ మాస్క్ లు ధరించడం వంటి భద్రతా చర్యలు చేపట్టాలని, భౌతిక దూరం పాటించాలని గడ్కరీ సూచించారు. అయితే ప్రజా రవాణాను ఏ తేదీ నుంచి అనుమతిస్తారనేది మంత్రి వెల్లడించలేదు.