మన దేశంలో పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఒకట్రెండు రూపాయలు కాదు.. ఏకంగా ఆరు రూపాయల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ అరామ్‌కోకు చెందిన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటు దారుల డ్రోన్ల దాడి నేపథ్యంలో పెట్రో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సౌదీ ప్రభావం భారత్‌లో రిటైల్ ధరలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ధరలతో ముడిపడి ఉంటాయి. దీంతో అంతర్జాతీయంగా ఏ పరిణామం అయినా భారత్‌లో చమురు ధరలపై కనబడుతుంది. ప్రస్తుత పరిణామం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారి తీస్తుందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.
ప్రస్తుతం భారత ఇంధన అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే తీరుతోంది. ప్రస్తుతానికి ధరలు నిలకడగానే ఉన్నా.. త్వరలో మరింత పెరిగే అవకాశం లేకపోలేదని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆరు రూపాయల వరకు పెరగొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా మరోసారి సామాన్యుడిపై పెట్రో పిడుగు పడబోతోంది.