2600 పడకలతో అతిపెద్ద ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ

బుధవారం, 24 ఆగస్టు 2022 (20:19 IST)
దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రి హర్యానా రాష్ట్రంలో నిర్మించారు. మొత్తం 2600 పడకల సౌకర్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఆధునిక, సాంకేతికతల మేళవింపుగా నిర్మించిన ఈ ఆస్పత్రిరి అమృత హాస్పిటల్ అని పేరు పెట్టారు. 
 
ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, మాతా అమృతానందమయి తదితరులు పాల్గొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఆస్పత్రిని ఆరేళ్లపాటు శ్రమించి నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో పూర్తిగా ఆటోమేటిక్ ల్యాబ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశంలో వైద్య రంగానికి, ఆధ్యాత్మికతకు ఎంతో సామీప్యత ఉందన్నారు. ఇందుకో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆధ్యాత్మిక - ప్రైవేటు భాగస్వామ్యమే కారణమని తెలిపారు. 
 
ఈ ఆస్పత్రిని 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో పరిశోధనల కోసం ఏడు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించగా, 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విభాగం కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు