పీఎన్‌బీ స్కామ్.. నీరవ్ మోదీకి ఝలక్ ఇచ్చిన లండన్ కోర్టు
బుధవారం, 12 జూన్ 2019 (16:11 IST)
నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడు, విదేశాల్లో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది.
అంతేగాకుండా నీరవ్‌కి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పనిలో పనిగా జడ్జి నీరవ్ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ లభిస్తే నీరవ్ మోడీ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
విచారణ సందర్భంగా జడ్జి నీరవ్ మోడీ తరఫు న్యాయవాదికి గట్టిగా చురకలేశారు. బెయిల్ లభిస్తే సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా ఉంటారనే నమ్మకం తనకు కలగడం లేదని చెప్పారు. కాగా మనీలాండరింగ్‌కు నీరవ్ పాల్పడ్డారని.. దాదాపు 14వేల కోట్ల వరకు మోసం చేశాడని కోర్టు తెలిపింది.
ఇలాంటి పరిస్థితుల్లో మే 31వ తేదీన యూకే హైకోర్టులో నీరవ్ మోదీ.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బెయిల్‌ను కోర్టు తిరస్కరించడంతో పాటు జూన్ 27వ తేదీ వరకు బ్రిటిష్ నీరవ్ మోదీ రిమాండ్‌ను 27వ తేదీ వరకు పొడిగించింది.