పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన భారీ కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన పెయింటింగ్స్‌ను ఆదాయపన్ను శాఖ మంగళవారం వేలం వేసింది. ఈ వేలంలో ఆదాయపు పన్ను శాఖకు 59.37 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ నీరవ్ మోదీకి చెందిన 68 పెయింటింగ్స్‌ను వేలం వేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 13,000 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసిన నిందితుడు నీరవ్ ఆదాయపన్ను శాఖకు ఇప్పటివరకు రూ.97 కోట్లు బకాయి ఉన్నాడు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టు మార్చి 20న దర్యాప్తు సంస్థలు నీరవ్ మోదీకి యాజమాన్య హక్కులున్న 173 పెయింటింగ్స్, 11 వాహనాలను వేలం వేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రైవేట్ కంపెనీ సహాయం తీసుకుని ఈ పెయింటింగ్స్ వేలం వేసింది. కంపెనీ కమిషన్ మినహహాయించుకుని ఆదాయపన్ను శాఖకు మొత్తం 54.84 కోట్ల రూపాయలు వస్తాయి. నీరవ్ మోదీ పెయింటింగ్ కలెక్షన్‌లో రాజా రవి వర్మ, జగన్ చౌదరి, వీఎస్ గాయ్ తోండే, ఎఫ్ఎన్ సూజా, అక్బర్ పదమ్సీ వంటి సుప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్స్ ఉన్నాయి.