జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో సైనిక వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఇందులో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కేంద్ర హోం శాఖ హైఅలెర్ట్ ప్రకటించింది. కేంద్ర పారా మిలిటరీ బలగాలు తమ కదలికల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గురువారం జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. పూంఛ్ జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళుతున్న ఆర్మీ వాహనంపై తీవ్రవాదులు గ్రెనేడ్లతో దాడికి తెగబడిన విషయం తెల్సిందే. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమై హైఅలెర్ట్ ప్రకటించింది. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులతో పాటు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్, ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి సెక్టార్‌లో కూడా ఉగ్రవాదులు పాక్ వైపు నుంచి తిరిగి చొరబాట్లకు పాల్పడకుండా హైఅలెర్ట్ ప్రకటించింది.
అలాగే, ఈ దాడి తర్వాత భారత భద్రతా దళాలు మెంధార్ సబ్ డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. భింబర్ గలి, భాటా ధురియన్ మధ్య జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేసింది. భటా, ధురియన్ మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో భింబర్ గలి నుండి సురన్‌కోట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్టు పూంచ్ జిల్లాలోని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు.