మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10వ తేదీ నుంచి ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆరోగ్యం విషమించి మృతి చెందారు. అయితే, ఆయన కరోనా వైరస్ కారణంగా చనిపోయారనీ, మెదడుకు సర్జరీ చేయడం వల్ల చనిపోయారనీ, ఇలా పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. దీంతో సైనిక ఆస్పత్రి వైద్య వర్గాలు ప్రణబ్ మృతిపై ఓ ప్రకటన చేశాయి. ప్రణబ్ ముఖర్జీ సెప్టిక్ షాక్‌తో మరణించినట్లు వైద్యులు తెలిపారు.
అసలు సెప్టిక్ షాక్ అంటే ఏమిటంటే.. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు.. వాటిపై పోరాటంలో భాగంగా శరీరం రక్తంలోకి కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఆ రసాయనాల మోతాదు పెరిగిపోయినప్పుడు రక్తం విషపూరితమైపోతుంది. ఈ స్థితిని సెప్సిస్ అంటారు. అది తీవ్ర సెప్సిస్‌కు, అంతిమంగా సెప్టిక్ షాక్‌కు దారి తీస్తుంది. ఆ దశలో.. రక్తపోటు ప్రమాదకరస్థాయులకు పడిపోతుంది. శరీరంలోని పలు కీలక అవయవాలకు ఆక్సిజన్ అందక అవి దెబ్బతింటాయి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ పనిచేయడం మానేస్తాయి. చివరకు మరణిస్తారు. ప్రణబ్ ముఖర్జీ విషయంలో ఇదే జరిగింది.
దేశంలో ఏడు రోజులు సంతాప దినాలు..
ఇకపోతే, దేశానికి ఆయన అందించిన సేవలకు నివాళిగా కేంద్రం ఏడు రోజులు (ఆగస్టు 31-సెప్టెంబరు 6) సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ ఏడు రోజుల్లో అధికారికంగా ఎలాంటి వినోద కార్యక్రమాలూ ఉండబోవని తెలిపింది.