తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీసారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సిఎం గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత నీకు దక్కిందని అని నన్ను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పారు.
ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్‌కు తెలంగాణ అంశమే తప్ప పోర్టుఫోలియో అక్కరలేదని పేర్కన్నారని గుర్తు చేశారు. దీన్నిబట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు.
యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు.
ప్రణబ్ మరణం తీరని లోటని సిఎం బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరపున, తెలంగాణ ప్రజల తరపున ప్రణబ్‌కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.