ప్రేమ పేరుతో మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. పెళ్ళి చేసుకోమంటే పొమ్మన్నాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గర్భవతి అయిన ప్రేయసిని క్షమించమని అడిగి నటించాడు. దాన్ని నమ్మి ప్రేయసి ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. అయితే ఆ ప్రేయసిని చంపేందుకు ప్రియుడు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో గర్భవతి అనే కనికరం లేకుండా కదిలే రైలు నుంచే తోసేశాడు. ఈ ఘటన కోల్‌కతాలోని మాల్దా రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాల్దా నుంచి శంసీ స్టేషన్‌కు వెళుతున్న కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి గర్భవతైన తన ప్రియురాలిని రైలు నుంచి బయటకు నెట్టేశాడు. ఆ సమయంలో ఆమె చేసిన ఆర్తనాదాలు విన్న రైల్వే పోలీసు అధికారులు రైల్వే పట్టాలపై ఆమె పడి ప్రాణాపాయ స్థితిలో ఉండడాన్ని గమనించారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ బాధితురాలు కుడిచేయి కోల్పోయిందని.. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, సదరు నిందితుడిపై ఇంకో కేసు కూడా ఉందని.. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.