మహిళలకు ఎక్కడా కూడా భద్రత లేకుండా పోయింది. వసతి గృహం ముసుగులో అమ్మాయిలు, మహిళలను వ్యభిచారం రొంపిలోకిదించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా కేంద్రంలో వసతి గృహం నుంచి పారిపోయి వచ్చిన పదేళ్ల బాలిక ఈ పచ్చి నిజాన్ని వెల్లడించింది. 'రాత్రి సమయాల్లో మా వసతి గృహానికి ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో ఉండే కార్లు వస్తాయి. అక్కలను తీసుకెళతాయి. మళ్లీ ఉదయాన్నే తీసుకొచ్చి వదిలిపెడతాయి. ఆ తర్వాత రోజంతా అక్కలు ఏడుస్తూనే ఉంటారు' అని ఆ బాలిక వెల్లడించింది.
ఆమె చెప్పిన మాటలు విన్న పోలీసులకే కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. వెంటనే, దేవరియా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వసతి గృహంపై దాడి చేశారు. అక్కడ వారికి చిక్కి శల్యమై, ఒంటిపై వాతలతో, కళ్ల కింద గుంటలతో దారుణ స్థితిలో 24 మంది బాలికలు కనిపించారు. అక్కడ మొత్తం 42 మంది బాలికలు ఉన్నారని రికార్డుల్లో ఉండటంతో.. మిగిలిన 18 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వీరంతా 15-18 ఏళ్ల బాలికలే. వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. బిహార్ షెల్టర్ హోమ్ ఘటనలో ప్రతిపక్షాలు నితీశ్ సర్కారును దుయ్యబడుతుండటంతో.. యోగి అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరును విధుల నుంచి తప్పించారు. మరోవైపు ప్రతిపక్షాలు యోగిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఆయన పాలనలో రాష్ట్రంలో స్త్రీలకు రక్షణ కరువైందంటూ మండిపడ్డాయి.