డ్రగ్ మాఫియాకు మహిళా ఇన్‌స్పెక్టర్ బలి

శనివారం, 30 మార్చి 2019 (12:45 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌ను డ్రగ్ మాఫియా చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలో నేహా షూరీ అనే మహిళ డ్రగ్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది. ఈమె పదేళ్ళ క్రితం బల్విందర్ సింగ్ అనే వ్యక్తికి చెందిన కెమికల్ లెబోరేటరీస్‌పై తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 35 రకాల నిషేధిత మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత లోబోరేటరీకి సీల్ వేసి.. కెమిస్ట్ డ్రగ్స్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
 
దీంతో బల్వీందర్ సింగ్ ప్రతికారంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కాల్పులకు తెగబడ్డాడు. ఉదయం 10.30 గంటలకు నేహా కార్యాలయానికి బైక్‌పై వచ్చిన బల్వీందర్ సింగ్... నేరుగా నేహా ఉన్న గదిలోకి వెళ్లి రెండు బుల్లెట్లను కాల్చాడు. అవి నేహా తలలో, చాతీలో దూసుకెళ్లాయి. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. 
 
ఆ తర్వాత బల్విందర్ 'హ్యప్పీ హోలీ' అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గేటు వద్ద సిబ్బంది అడ్డుకోవడంతో తన వద్దనున్న రివాల్వర్‌తో ఛాతీ, తల భాగాల్లో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీకి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు