పంజాబ్‌కు షాకిచ్చిన కోల్‌కతా.. 28 పరుగుల తేడాతో గెలుపు

శుక్రవారం, 29 మార్చి 2019 (11:32 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. అయినా క్రిస్‌గేల్ ఉన్నాడనే కొండంత ధైర్యంతో ఉన్న పంజాబ్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. కెఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. 
 
13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన గేల్... రస్సెల్ బౌలింగ్‌లో ప్రసీద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 37 పరుగులకే ఓపెనర్లద్దరినీ కోల్పోయింది పంజాబ్ జట్టు. దీంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. 
 
13 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లోనే కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నాలుగో వికెట్‌కు 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌పై పట్టు కోల్పోకుండా కాపాడారు. ఈ దశలో 28 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మయాంక్ అగర్వాల్. మయాంక్‌కు ఇది ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో అర్ధశతకం. 
 
34 బంతుల్లో 58 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంజాబ్ జట్టులో బ్యాట్స్‌మెన్లు రాణించలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు సాధించింది. డేవిడ్ మిల్లర్ 59 పరుగులతో, మన్‌దీప్ 33 పరుగులతో అజేయంగా నిలిచారు. 
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.  కోల్‌కత్తా ఇన్నింగ్స్‌లో ఆండ్రూ రస్సెల్ ఇన్నింగ్సే హైలెట్. 
 
క్రీజులో ఉన్నంతసేపు అదరగొట్టిన రస్సెల్ 17 బంతుల్లో 3 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 48 పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా కీలక వికెట్లు తీసిన రస్సెల్... కోల్‌కత్తా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పంజాబ్‌పై కోల్ కతా 28 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు