వాయుసేన అమ్ములపొదిలో రాఫెల్ : శత్రు దేశాలకు రాజ్‌నాథ్ హెచ్చరిక

గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:39 IST)
భారత వాయుసేన అమ్ములపొదిలో అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. ఫ్రాన్స్ కొనుగోలు చేయనున్న 36 రాఫెల్ జెట్లలో తొలి దశలో ఐదు విమానాలు వచ్చాయి. వీటిని భారత వాయుసేనకు అప్పగించే కార్యక్రమం గురువారం హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానిక కేంద్రంలో జరిగింది. ఇందులో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాఫేల్ రాక‌తో భార‌త్‌, ఫ్రాన్స్ మ‌ధ్య బంధం బ‌లోపేత‌మైంద‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క సంబంధాలు కూడా బ‌ల‌ప‌డ్డాయ‌న్నారు. రాఫేల్ కోసం ఎన్నో అవాంత‌రాలు ఏర్ప‌డ్డాయ‌ని, కానీ ప్ర‌ధాని నరేంద్ర మోడీ బల‌మైన కాంక్ష వ‌ల్ల ఇది సాధ్య‌మైందన్నారు. స్వేచ్ఛ, స‌మాన‌త్వం, సోద‌ర‌భావం, వ‌సుదైక కుటుంబం అన్న సూత్రాల‌కు రెండు దేశాలు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. 
 
ఈ సూత్రాల‌నే రెండు దేశాలు ప్ర‌పంచ‌వ్యాప్తం చేస్తున్నాయ‌న్నారు. భార‌త స్వాతంత్ర్యం త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగుప‌డిన‌ట్లు చెప్పారు. రాఫేల్ ఇండ‌క్ష‌న్ కార్య‌క్ర‌మంలో ఫ్రాన్స్ ర‌క్ష‌ణ మంత్రి ఫ్లోరెన్స్ పాల్గొన‌డం రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యాన్ని గుర్తు చేస్తోంద‌న్నారు. 
 
ప్ర‌పంచ శాంతి కాంక్ష‌తోనే తాము త‌మ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. శాంతియుత వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసే విధంగా తాము ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌బోమ‌న్నారు. గోల్డెన్ యారోస్ స్క్వాడ్ర‌న్‌లో రాఫేళ్లు ఓ మెరుపులా మెరుస్తాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. 
 
భార‌త వాయుసేన‌లోకి రాఫెల్ చేరిక‌ యావ‌త్ ప్ర‌పంచానికి అతి పెద్ద‌, క‌ఠిన సందేశాన్ని ఇస్తుంద‌ని రాజ్‌నాథ్ తెలిపారు. మ‌న సార్వ‌భౌమ‌త్వంపై క‌న్నువేసిన వారికి ఈ యుద్ధ‌విమానాలు వ‌ణుకు పుట్టిస్తాయ‌న్నారు. ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దుల్లో ఉన్న వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఇండ‌క్ష‌న్ ఎంతో కీల‌క‌మైంద‌న్నారు. 
 
ఇటీవ‌ల తాను విదేశీ టూర్‌కు వెళ్లాన‌ని, అక్క‌డ భార‌త్ అభిప్రాయాన్ని సుస్ప‌ష్టం చేసిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఎటువంటి ప‌రిస్థితుల్లో త‌మ భూభాగాన్ని వ‌దులుకునేది లేద‌ని తేల్చిచెప్పిన‌ట్లు గుర్తు చేశారు. భార‌తీయ వాయుద‌ళానికి కంగ్రాట్స్ చెబుతున్నాన‌ని, కానీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప‌రిస్థితులు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఎల్ఏసీ వ‌ద్ద మీరు చేప‌ట్టిన చ‌ర్య‌లు మీరెంత క‌ట్టుబ‌డి ఉన్నారో చెబుతుంద‌ని రాజ్‌నాథ్ తెలిపారు. 
 
కాగా, భారత్-పాక్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలో అంబాల వైమానిక స్థావరం ఉంటుంది. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు భార‌త వాయుద‌ళ శ‌క్తిని మ‌రింత పెంచ‌నున్నాయి. ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకోగ‌ల‌వు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు