ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఐదు విడతల అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, మరో 3 విడతలు మిగిలున్నాయి. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాను బెంగాల్‌లో సభలు, సమావేశాల్లో పాల్గొనబోనని రాహుల్ గాంధీ ప్రకటించారు.
బెంగాల్‌లో తాను పాల్గొనాల్సిన అన్ని సభలను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. రాజకీయ నేతలందరూ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని, భారీ ప్రజానీకంతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఏర్పాటు చేస్తే వచ్చే పర్యవసానాలపై లోతుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రధాన పోటీ అంతా అధికార టీఎంసీ, బీజేపీ మధ్యే నెలకొంది. ఇప్పుడు రాహుల్ సభలు రద్దు చేసుకున్నా కాంగ్రెస్‌కు కలిగే నష్టం ఏమీ ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రజానీకానికి ఏమైనా ఫర్లేదు కానీ.. తమకు రాజకీయాలే ముఖ్యమన్న తీరుతో నడుచుకుంటున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.