సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోయినా.. ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని ఆదుకునేందుకు లేదా పోలీసులకు సమాచారం చేరవేసేందుకు ప్రయత్నిస్తాం. ఇది కనీస ధర్మం కూడా. కానీ, ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని నిజంగా పిచ్చోళ్ల కింద పరిగణించాల్సిందే. ఎందుకంటే... యాక్సిడెంట్ జరిగి పలువురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉంటే వారితో సెల్ఫీలు తీసుకున్నాడో ఓ మానసికపిచ్చోడు. అసలు నిజంగా వీడు మనిషేనా అనే ప్రతి ఒక్కరూ అనుకునేలా ప్రవర్తించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మీర్ జిల్లా జైసల్మీర్ రహదారిపై ఈనెల 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న పరమానంద్ (27), జీమారం(30), చంద్రం (30) అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పరమానంద్ ప్రమాద స్థలంలోనే చనిపోయాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే అక్కడికి వచ్చిన స్థానికులు, రోడ్డపై వెళుతున్న వారు ప్రమాద స్థలంలో ఆగారు. అయినా కూడా ఎవరూ స్పందించలేదు. కొందరు అయితే సెల్ఫీలు దిగారు. మరికొందరు సినిమా చూస్తున్నట్లు చూశారు. ఇద్దరు కుర్రోళ్లు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ప్రాణాలతో కొట్టమిట్టాడుతుంటే సెల్ఫీలు దిగటానికి ప్రయత్నించారు.
కనీసం 30 నిమిషాల వరకు ఎవరూ కూడా కాపాడాలనే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత ఓ వ్యక్తి స్పందించి పోలీసులు, అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. యాక్సిడెంట్ స్పాట్‌లో కాపాడకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటిని సగర్వంగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ కూడా చేశాడు.
కాగా, ఈ ప్రమాదంలో పరమానంద్ ఘటనా స్థలంలోనే చనిపోగా.. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. సకాలంలో వైద్యం అందకపోవటం వల్లే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. ప్రమాదంలో ఉన్నవారిని రక్షించకుండా వారితో సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.