వివిధ రకాలైన పోటీ పరీక్షలకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచిన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థితో కలిసి ఈ యేడాది ఇప్పటివరకు 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత యేడాది నమోదైన మరణాలతో పోల్చుకుంటే ఈ యేడాది ఈ సంఖ్య దాటిపోయింది. ప్రతి నెలా ఒకరు లేదా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. గతం వారం రోజుల్లో ఇది మూడో ఘటన కావడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజాంగఢ్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ల మనీశ్ ప్రజాపత్ అనే యువకుడు కోటాలోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటరులో గత ఆరు నెలలుగా జేఈఈ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ విద్యార్థి గురువారం ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతని గదిలో ఎలాంటి సూసైడ్ లేఖ కనిపించలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ తాజాగా ఆత్మహత్యతో కలుపుకుంటే ఈ యేడాది ఇప్పటివరకు 21 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఒత్తిడేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, గత యేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా, ఈ యేడాది ఇప్పటివరకు 21 మంది తనువులు చాలించడం తీవ్ర విషాదానికి గురి చేస్తుంది.